న్యూఢిల్లీ: మాక్రోఫేజెస్ అనే తెల్ల రక్త కణాలతో క్యాన్సర్ నిర్మూలన సాధ్యమవుతున్నదని పరిశోధకులు చెప్తున్నారు! అసాధారణ కణతుల(సాలిడ్ ట్యూమర్స్) మాలిక్యూలర్ పాథ్‌వేను మూసేయడం ద్వారా అవి శరీరంలోని ఇతర కణాలపై దాడులు చేయకుండా అడ్డుకోవచ్చని వారు తెలిపారు. రొమ్ము, బ్రెయిన్, చర్మ క్యాన్సర్లకు చికిత్స చేయడం కష్టమని, మిగిలిపోయిన క్యాన్సర్ కణాలు రెండింతలై శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని నేచర్ బయో మెడికల్ ఇంజినీరింగ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.
తాము ప్రతిపాదించిన కొత్త విధానం క్యాన్సర్ కణాలను తొలగించడమే కాకుండా ఆ తరహా కణాలను గుర్తించి వాటిని చంపే విధానాన్ని రోగ నిరోధక శక్తికి బోధిస్తుందని పరిశోధకులు చెప్పారు. మాక్రోఫేజెస్ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తాయని, దీనికోసం కణాల మధ్య జరిగే కమ్యూనికేషన్‌ను నియంత్రించే మాలిక్యూలర్ పాథ్‌వేపై పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఇంజినీర్డ్ సెల్స్ 80 శాతం ట్యూమర్స్‌ను తొలగించాయని వారు వెల్లడించారు.