న్యూఢిల్లీ: ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధ విమానాల డీల్ సందర్భంగా చేతులు మారిన ముడుపుల సంగతి సీబీఐకి గతంలోనే తెలిసినప్పటికీ దీనిపై దర్యాప్తు చేయకూడదని నిర్ణయించినట్లు ఓ నివేదిక బటయపడింది. ఫ్రాన్స్‌కు చెందిన మీడియాపార్ట్ పోర్టల్ ఈ మేరకు ఆరోపిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
రూ.59,000 కోట్ల రాఫెల్ డీల్‌పై ఆన్లైన్ జర్నల్ మీడియాపార్ట్ దర్యాప్తు చేస్తున్నది. తప్పుడు ఇన్వాస్లను ఎనేబుల్ చేసేందుకు మధ్యవర్తి సుసేన్ గుప్తాకు డస్సాల్ట్ కంపెనీ రహస్య కమీషన్లు చెల్లించినట్లు ఆరోపించింది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధార పత్రాలు ఉన్నప్పటికీ భారతీయ ఫెడరల్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తును ప్రారంభించలేదని ఆ పోర్టల్ పేర్కొంది.
రాఫెల్ జెట్ల అమ్మకానికి దస్సాల్ట్ కంపెనీ మధ్యవర్తి సుసేన్ గుప్తాకు చెందిన మారిషస్ షెల్ కంపెనీకి 7.5 మిలియన్ యూరోలు (దాదాపు రూ.650 మిలియన్లు) కిక్‌బ్యాక్‌గా చెల్లించినట్లు 2018 అక్టోబర్ 11న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఆధారాలు అందాయని మీడియాపార్ట్ తెలిపింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ ఛాపర్ల సరఫరాకు సంబంధించిన కుంభకోణంపై ఈ రెండు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న సందర్భంగా బయటపడిన రహస్య పత్రాల్లో రాఫెల్ డీల్ ముడుపులకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది. ఆరోపించిన చెల్లింపుల్లో ఎక్కువ భాగం 2013కు ముందు జరిగినట్లు తెలిపింది.
మారిషస్ నుంచి సీబీఐ, ఈడీకి అందిన రహస్య పత్రాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు (2007 – 2012) బిడ్‌ను దస్సాల్ట్ గెలుచుకోగా, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఒప్పందం ఖరారైనట్లు మీడియాపార్ట్ తెలిపింది. అయితే రాఫెల్ డీల్‌లో 2015 నుంచి అనుమానాస్పద లావాదేవీల కార్యాచరణ జరిగినట్లు 2018 అక్టోబర్ 4న సీబీఐకి ఫిర్యాదు అందిందని ఆ పోర్టల్ పేర్కొంది.
అనంతరం ఏడు రోజులకు అంటే 2018 అక్టోబర్ 11న ఈ డీల్ ముడుపులకు సంబంధించిన ఆధార పత్రాలు సీబీఐకి అందాయని, అయితే దీనిపై దర్యాప్తు చేయకూడదని ఆ సంస్థ నిర్ణయించిందని మీడియాపార్ట్ నివేదిక ఆరోపించింది. మరోవైపు ‘రాఫెల్ పత్రాల’పై మీడియాపార్ట్ దర్యాప్తు నేపథ్యంలో ఈ డీల్‌లో జరిగిన అవినీతిపై ఈ ఏడాది జూలైలో న్యాయ విచారణకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించింది.