న్యూఢిల్లీ: రేణుకా డ్యామ్(Renuka Dam) నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. సుమారు 6947 కోట్లతో ఈ బహుళ ప్రయోజనాల డ్యామ్‌ను నిర్మించనున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో నీటి కష్టాలను తీర్చేందుకు ఈ డ్యామ్ పనులు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఉన్న గిరి నదిపై ఈ డ్యామ్‌ను నిర్మించనున్నారు. 2021 డిసెంబర్లోనే ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు.
రెండో దశ అనుమతలను కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చేసింది. ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల 909 హెక్టార్ల అటవీ భూమిని డ్యామ్ నిర్మాణం కోసం వాడనున్నారు. ప్రస్తుతం డ్యామ్ నిర్మాణం కోసం భూసేకరణ ముగిసింది. టెక్నికల్ డిటేల్స్‌ను అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. యుమునా నదికి.. గిరి ఉపనది. అయితే మొదట మూడు 1.5 కిలోమీటర్ల డైవర్షన్ టన్నెల్స్ తాత్కాలికంగా నిర్మిస్తారు. 148 మీటర్ల ఎత్తు ఉండే ఈ డ్యామ్ ప్రాంతం పూర్తిగా రాళ్లతో నిండి ఉంది. 2030 నాటికి ఈ డ్యామ్ వినియోగంలోకి రానున్నది.
రేణుకా డ్యామ్ నిర్మాణం వల్ల 41 గ్రామాలు, 7 వేల మంది ప్రజలు, 346 కుటుంబాలపై ప్రభావం పడనున్నది. మొత్తం 1508 హెక్టార్ల నేల డ్యామ్ నీటిలో మునగనున్నది. దీంట్లో 1231 హెకా్టర్ల వ్యవసాయ భూమి, 909 హెక్టార్ల రిజర్వ్డ్ ఫారెస్ట్ భూములు, 49 ఎకరాల రేణుకా వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం మునగనున్నాయి. రేణుకా డ్యామ్ ప్రాజెక్టు కోసం 24 కిలోమీటర్ల టన్నెల్‌ను నిర్మించనున్నారు.
ఢిల్లీ నగర ప్రజలకు నీటిని అందించే రీతిలో డ్యామ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆ నగరానికి 23 క్యూసెక్కుల నీటిని నికరంగా సరఫరా చేయనున్నారు. అలాగే వర్షాకాలం సమయంలో వరదను నియంత్రించే రీతిలో డ్యామ్ కట్టనున్నారు.