చెన్నై, జూన్ 25 : ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందని కొంతమంది పురుషులు హింసకు పాల్పడుతున్నారని, తిరస్కరణ ఎదురైతే దాంతో హింసకు లైసెన్స్ పొందినట్టు కాదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహ విద్యార్థిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉదయకుమార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు సమర్థించింది. అతడు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం గురువారం కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది.
ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. 2016 నాటి ఈ కేసుకు సంబంధించి సోనాలి, ఉదయకుమార్ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత సోనాలి అతడితో తెగతెంపులు చేసుకుంది. ఈ తిరస్కారాన్ని తట్టుకోలేక ఉదయకుమార్ 2016 ఆగస్టు 30న ఆమె తరగతి గదిలోకి ప్రవేశించి, తోటి విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలోనే ఒక కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె మరణించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఉదయకు యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేయగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. ‘అమ్మాయి నుంచి తిరస్కరణకు గురైన అబ్బాయి.. ఆ అమ్మాయి తనతో సంబంధాన్ని కొనసాగించాల్సిదేనని భావించటం ఒక పోకడగా మారింది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
రాత్రి సమయాల్లో ఒక మహిళ ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఆమె గుణాన్ని(క్యారెక్టర్‌ను) తప్పు బట్టాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి మనిషికి వ్యక్తిగత గోప్యత అనేది ఉంటుందని తెలిపింది. తన భార్య అర్ధరాత్రి వేరే వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతున్నదని.. ఆమె కాల్ రికార్డును భద్రపరచాలని ఓ భర్త వేసిన పిటిషన్‌ను ట్రయర్ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. సదరు వ్యక్తి పిటిషన్‌ను కొట్టేసింది. ‘గోప్యతా హక్కు సంపూర్ణమైనది కాకపోయినప్పటికీ.. వ్యకిగత కాల్ రికార్డులు ఆమె క్యారెక్టర్‌ను నిర్ణయించలేవు. కాల్ రికార్డులను భద్రపరచాలంటే సరైన ఆధారాలను చూపించాల్సిందే’ అని కోర్టు అభిప్రాయపడింది.