న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఉగ్ర దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉగ్రవాదులైన డాక్టర్ల రిజిస్ట్రేషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. ముజఫర్ అహ్మద్, అదీల్ అహ్మద్ రాథర్, ముజమిల్ షకీల్, షహీన్ సయీద్‌లపై ఈ వేటు పడింది.
ఉమర్ ‘డాక్టర్’ ఫొటో వెలుగులోకి ఈ నెల 10న ఎర్ర కోట వద్ద పేలుడు జరిపిన టెర్రర్ డాక్టర్ ఉమర్ నబీ డాక్టర్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటో వెలుగులోకి వచ్చింది. అతను డాక్టర్ ముసుగులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అతను భాగస్వామి అని దర్యాప్తులో వెల్లడైంది.
మరికొందరు అనుమానితుల అరెస్ట్
ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వేగవంతం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దీనాజ్‌పూర్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి జనినూర్ వురపు నిసార్ ఆలంను అరెస్ట్ చేశారు. ఇతను అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం విద్యార్థి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక సర్జన్‌ను, అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.