లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలకారుల నుంచి వసూలు చేసిన కోట్ల మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుపై ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానంపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం స్పందించింది. నిరసనకారుల నుంచి రికవరీ చేసిన కోట్ల విలువైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాపస్ చేయాలని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే 2020 ఆగస్ట్ 31న యూపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఉత్తరప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ కింద నిరసనకారులపై చర్యలు కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది.
2019 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కొందరు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై సీఎం యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న కొందరి నుంచి నష్టం వ్యయాన్ని వసూలు చేసింది. కొందరి ఆస్తులను జప్తు చేసింది. ఈ మేరకు మరి కొందరికి నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ నోటీసులను రద్దు చేయాలని, ప్రభుత్వం వసూలు చేసిన కోట్లాది మొత్తాన్ని నిరసనకారులకు తిరిగి ఇప్పించాలని కోరుతూ పర్వైజ్ ఆరిఫ్ టిటు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరేండ్ల కిందట 94 ఏండ్ల వయసులో మరణించిన వ్యక్తి, 90 ఏండ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులతో సహా పలువురికి ఈ నోటీసులు పంపారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సీఏఏపై సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి ఇది విరుద్ధమని పేర్కొంది. రికవరీ నోటీసులు, దీనికి సంబంధించిన చర్యలను వెనక్కి తీసుకోవాలని, ఇదే చివరి అవకాశమని ఈ నెల 11న యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని, సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై సంబంధిత చర్యలను నిలిపివేశామని కోర్టుకు యూపీ ప్రభుత్వం తెలిపింది.
కాగా, రికవరీ సొమ్మును వెనక్కి తిరిగి వచ్చే బదులు ఈ వ్యవహారాన్ని ట్రిబ్యునల్‌కు బదిలీ చేయడానికి అనుమతించాలని ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ అఫిడవిట్ ద్వారా కోర్టును కోరారు. సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. సీఏఏ వ్యతిరేక నిరసనకారుల నుంచి రికవరీ చేసిన కోట్లాది పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.