న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట్ వద్ద కారు పేలుడుకు పాల్పడిన సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ(Dr Umar Nabi) ప్రణాళికల గురించి మరిన్ని డిటేల్స్ తెలిశాయి. అయితే డిసెంబర్ 6వ తేదీన అతను భారీ కుట్ర ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా డాక్టర్ నబీ భారీ దాడికి ప్రణాళిక రచించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీ బ్లాస్టుకు చెందిన కేసులో సుమారు 8 మందిని విచారించిన తర్వాత డాక్టర్ నబీ ప్లాన్ తెలిసినట్లు పేర్కొన్నారు. ఫరీదాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతర్ రాష్ట్ర వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్తో డాక్టర్ నబీకి లింకు ఉన్నట్లు చెప్పారు. పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ .. నవంబర్ 10న ఎర్రకోట్ వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
360 కేజీల అమోనియం నైట్రేట్ దొరికిన కేసులో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్‌తో పాటు మరో డాక్టర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాళ్ల అరెస్టుతో కంగారపడ్డ డాక్టర్ ఉమర్ నబీ భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ముజమ్మిల్‌తో కలిసి డాక్టర్ ఉమర్ 2021లో టర్కీ వెళ్లాడు. ఆ ట్రిప్ తర్వాత అతను రాడికల్‌గా మారినట్లు గుర్తించారు. వాస్తవానికి అకాడమిక్ చదువుల్లో ఉమర్ టాప్‌లో ఉన్నాడు. ఆ ఇద్దరూ టర్కీ ట్రిప్‌లో నిషేధిత జైషే మొహమ్మద్ గ్రూపుకు చెందిన వర్కర్లతో కలిశారు. టర్కీ పర్యటన తర్వాత భారీ పేలుడు పదార్ధాలను పొగు చేయడాన్ని ఉమర్ ప్రారంభించాడు. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ సేకరించడం మొదలుపెట్టాడు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న అల్ ఫలాహ్ క్యాంపస్ సమీపంలో వాటిని స్టోర్ చేయడం ప్రారంభించారు.
డిసెంబర్ 6వ తేదీన చేపట్టబోయే ఉగ్ర ప్రణాళిక గురించి తన తోటి వారికి ఉమర్ చెప్పినట్లు సమాచారం ఉన్నది. వెహికల్ బేస్డ్ ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను తయారు చేయడం అతను ప్రారంభించాడు. ఇంటర్నెట్ ఆధారంగా ఐఈడీలను తయారు చేయడం నేర్చుకున్నాడు. దానిలో భాగంగానే ఫరీదాబాద్‌లో 2900 కేజీల పేలుడు పదార్ధాలను సేకరించాడు. సోమవారం రాత్రి దాడి చేయడానికి ముందు ఢిల్లీలోని ఓ మసీదులో ఉమర్ మూడు గంటల పాటు గడిపినట్లు తెలుస్తోంది. రామ్ లీలా మైదాన్ సమీపంలో ఉన్న అసఫ్ అలీ రోడ్డులోని మసీదుకు నబీ వెళ్లాడు. అక్కడ అతను మూడు గంటలు గడిపాడు. నమాజ్ చేశాడు. ఇంకా అక్కడ ఏం జరిగిందన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు.
అక్టోబర్ 26వ తేదీన కశ్మీర్‌కు ఉమర్ వెళ్లాడు. ఆ టైంలో అతను స్నేహితులు, బంధువులతో గడిపాడు. అక్కడ నుంచి మళ్లీ ఫరీదాబాద్ చేరుకున్నాడు. మరో మూడు నెలల పాటు అందుబాటులో ఉండడం లేదని అతను వారికి చెప్పినట్లు గుర్తించారు. వీబీఐఈడీ బాంబులను అమర్చిన తర్వాత అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాలని ఉమర్ భావించినట్లు తెలుస్తోంది. కానీ శ్రీనగర్‌లో జైషేకు మద్దతుగా పోస్టర్లు వెలిసిన ఘటన ఈ కేసులో కీలక మలుపుగా మారింది. అక్టోబర్ 19వ తేదీన జైషేకు సపోర్టుగా పోస్టర్లు వేశారు. దీంతో శ్రీనగర్ పోలీసులు ఈ కేసును లోతుగా విచారించారు. దానిలో భాగంగానే ముజిమ్మల్ను అరెస్టు చేశారు. ఆ అరెస్టుతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు బయటకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.