ముంబై: దేశంలో ఇంధనాలపై పరోక్ష పన్నులను విపరీతంగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పడుతున్న దుష్ప్రభావంపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. క్రమేపీ పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని ఆర్బీఐ గవర్నర్ సూచనాప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. ఇంధనాలపై పరోక్ష పన్నులను భారీగా పెంచడంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన శక్తికాంతదాస్.. తాజాగా శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ప్రకటనల సందర్భంగా రెండోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ లాంటి ఇంధనాలపై సుంకాలను, సెస్సులను రికార్డు స్థాయికి పెంచి భారీగా ఆదాయాన్ని వసూలు చేసిన విషయం తెలిసిందే. ధరల పెరుగుదల తర్వాత కూడా ప్రభుత్వం పన్నులను తగ్గించకపోవడంతో లీటర్ పెట్రోల్ కొనుగోలుకు భారతీయులు రూ.100కుపైగా చెల్లించాల్సి వస్తున్నది. డీజిల్ ధర కూడా మూడంకెలకు చేరువైంది. దీనిపై తమ ఆందోళనలను, సూచనలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామని, దీనిపై ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
లీటరు పెట్రోల్‌పై 30 పైసలు..డీజిల్‌పై 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచా యి. దీంతో భగ్గుమంటున్న ధరల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లుపడుతున్నది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.54కు పెరుగగా.. ముంబైలో రూ.109.54కు చేరింది. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.92.12కు ఎగబాకగా.. ముంబైలో రూ.99.92కు పెరిగింది. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు లీటరు పెట్రోల్‌పై రూ.2.35 పైసలను కంపెనీలు పెంచాయి. అలాగే గత నెల 24 నుంచి ఇప్పటి వరకు లీటరు డీజిల్‌పై రూ.3.5పైసలను వడ్డించాయి.