RBI : ఆర్బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. జూన్ 30 తర్వాత నుంచి దేశంలో పేపర్ నోట్లు చెల్లబోవు అనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్లను జూన్ 30 తర్వాత ఆర్బీఐ నిషేధించిందని, ఆ తర్వాత నుంచి ఈ నోట్లు చెల్లవని ప్రచారం జరుగుతోంది. వీటి స్థానంలో ప్లాస్టిక్ రాబోతున్నట్లు వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ అవుతోంది. దీంతో 2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్ద చేసినప్పటి పరిస్థితులు ఎదురవుతాయేమో అనే భయం ప్రజల్లో కనిపిస్తోంది. అయితే, ఈ ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ప్రభుత్వ ప్రచారాలపై నిగ్గు తేల్చే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకారం ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది.
ఆర్బీఐ ఇలాంటి ప్రకటన ఏమీ చేయలేదని వివరించింది. పేపర్ నోట్ల స్థానంలో, ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ప్రస్తుతానికి ఆర్బీఐ చేయలేదని తెలిపింది. వినియోగదారులు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని, ఇటువంటివి ప్రచారమైనప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.