న్యూఢిల్లీ: ప్రఖ్యాత భారత చిత్రకారుడు రాజా రవి వర్మ 1890లో గీసిన ‘యశోద & కృష్ణ’ చిత్రం ఈ నెల 1న జరిగిన వేలంలో రూ.167 కోట్ల ధర పలికింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని వేలం వేసిన సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ దీనికి రూ.80-120 కోట్లు రావొచ్చని అంచనా వేసింది.
అయితే గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఒక భారతీయ కళాఖండంగా ఈ చిత్రం నిలిచింది. దీన్ని కొనుగోలు చేసిన పూనావాలా మాట్లాడుతూ.. ‘జాతీయ సంపద అయిన రాజా రవి వర్మ చిత్రాన్ని కొనుగోలు చేసి భద్రపరిచే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు దీన్ని చూసేందుకు అందుబాటులో ఉంచుతాను’ అని వ్యాఖ్యానించారు.