Ravi Shanker Prasad : నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేయడం, అందుకు ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టడం లాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ స్పందించింది. చారిత్రక నేపథ్యంగల నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రైవేటు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించింది.
బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కుందికానీ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదని అన్నారు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజా ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ (ఏజేఎల్) కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఆ వార్తా పత్రికను గాంధీల కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంలా వాడుకుందని దుయ్యబట్టారు.
ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని.. ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్న దేశమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని, అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. సోనియాను ఎ-1గా, రాహుల్‌ను ఎ-2గా పేర్కొంది. తదుపరి విచారణను ఈడీ కోర్టు ఈ మనెల 25కి వాయిదా వేసింది. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబె తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొన్నది.