Ration Card Rules | దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే రేషన్ సరుకులు సరఫరా చేస్తూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన (పీఎం-జీకేఏవై) అమలు చేస్తున్నది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత కేంద్రం.. ఆరు నెలల పాటు అంటే వచ్చే సెప్టెంబర్ వరకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మరునాడే యూపీ సర్కార్ కూడా.. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు ఈ పథకం లబ్ధిదారుల నెత్తిన బండ పడబోతున్నది. ప్రత్యేకించి రేషన్ కార్డు జారీకి అర్హతల నిబంధనలను కేంద్రం మార్చబోతున్నదని సమాచారం.
ఫ్రీరేషన్ స్కీం కింద లబ్ధి పొందాలనుకునే వారు సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాల్లో రేషన్ కార్డు ఒకటి. ప్రస్తుతం అమలులో ఉన్న రేషన్ కార్డు నిబంధనలలో కొన్ని మార్పులు తేవాలని ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ విభాగం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ రాష్ట్రాల అధికారులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి రేషన్ కార్డు జారీ చేయడానికి అర్హతలను మార్చే అంశాన్ని చర్చిస్తుందని సమాచారం. అదే జరిగితే ప్రస్తుత లబ్ధి దారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికంగా స్థిర పడిన వారు కూడా ఫ్రీ రేషన్ పథకాన్ని ఉపయోగించుస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. వీరందరినీ తప్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం `వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్` పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం రేషన్ కార్డు చేతిలో ఉంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చు.