న్యూఢిల్లీ: అధికార భారతీయ జనతాపార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ కళ్లలోకి చూడమని (ఆరెస్సెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకొమ్మని) తనపై ఎవరూ ఒత్తిడి చేయాలేరని, అలాంటి పరిస్థితే వస్తే అంతకంటే ముందుగా తాను తల తీసేసుకుంటానని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత, తన సోదరుడు వరుణ్‌గాంధీ (సంజయ్‌గాంధీ కొడుకు) కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నాడనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వరుణ్‌గాంధీ విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. అతని భావజాలం వేరు, తన భావజాలం వేరని రాహుల్ వ్యాఖ్యానించారు.
వరుణ్‌గాంధీ ఆరెస్సెస్ భావజాలాన్ని అంగీకరించారని, అది అతని వ్యక్తిగత విషయమని, అయితే ఆ భావజాలాన్ని తాను అంగీకరించలేనని రాహుల్‌గాంధీ చెప్పారు. తమ ఇద్దరి ఐడియాలజీలు వేరని అన్నారు. తనకు ఆరెస్సెస్ భావజాలం నచ్చదని, తాను ఆరెస్సెస్ ఆఫీస్‌లో అడుగుపెట్టాల్సి వస్తే అంతకంటే ముందుగా తల తీసేసుకుంటానని తీవ్రంగా స్పందించారు.
అయితే, వరుణ్‌గాంధీ ఎదురుపడితే తాను తప్పకుంటా మాట్లాడుతానని, ప్రేమగా కౌగిలించుకుంటానని రాహుల్‌గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో ప్రవేశించిన సందర్భంగా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని, దాంతో బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన పేర్కొన్నారు.