Ratan Tata | ముంబై, అక్టోబర్ 9: వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రెండు రోజుల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మృతి చెందిన విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. తన స్నేహితుడు, మార్గదర్శిని కోల్పోయినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20 ఏండ్ల పాటు టాటా సంస్థలను రతన్ టాటా విజయవంతంగా నడిపించారు. వ్యాపారానికి మించి దాతృత్వానికి మారుపేరుగా ఆయన నిలిచారు. అనేక పరిశ్రమలు కలిగిన టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా రతన్ టాటా 1991లో బాధ్యతలు స్వీకరించి 2012వరకు కొనసాగారు. టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ సేవా సంస్థ అయిన టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2000లో రతన్ టాటాకు పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి.
రతన్ టాటా మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రతన్ టాటా దూరదృష్టి కలిగిన వ్యాపార నాయకుడని, దయాగుణం కలిగిన అసాధారణ మనిషి అని ప్రధాని ‘ఎక్స్’లో కొనియాడారు. రతన్ టాటా వ్యాపారంతో పాటు దాతృత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక, వ్యాపార, పరిశ్రమల్లో రతన్ టాటా అనేక సేవలు అందించారని, భారతీయ పరిశ్రమల్లో ఆయన టైటాన్ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రతన్ టాటా మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్టు ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు.
1937లో రతన్ టాటా జన్మించారు. 1948లో ఆయన తల్లిదండ్రులు వేరుపడటంతో నానన్న నవజ్బాయ్ టాటా వద్ద రతన్ టాటా పెరిగారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్లో పట్టభద్రుడైన తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. రతన్ టాటా అవివాహితుడు. అయితే, లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అప్పుడు 1962 ఇండియా – చైనా యుద్ధం జరుగుతుండటంతో అమ్మాయిని రతన్ టాటాతో పాటు భారత్‌కు పంపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆయన ప్రేమకు దూరమయ్యారు.
రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త అని, అద్భుతమైన మానిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అనేకమందికి ఆయన ప్రేరణగా నిలిచారని, ఆయన వినయం నిండిన దిగ్గజం అని అన్నారు. టీహబ్‌ను చూసిన ప్రతిసారీ రతన్ టాటాను గుర్తు చేసుకుంటామని, ఆయన అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని అన్నారు.
పేరు: రతన్ టాటా
జననం: 1937 డిసెంబర్ 28
మరణం: 2024 అక్టోబర్ 9
విద్యార్హతలు: ఆర్కిటెక్చర్లో బ్యాచ్లర్స్ డిగ్రీ
టాటా గ్రూప్ అధినేతగా: 1991-2012, 2016-2017
అవార్డులు: పద్మభూషణ్, పద్మవిభూషణ్, మహారాష్ట్ర భూషణ్, అస్సాం బైభవ్, ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్