న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపధ్యంలో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగిన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో ప్రధాని మోదీ ఎందుకు పర్యటించరని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి నిలదీశారు.
త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ను విస్మరించడం లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాగా, డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇరు పక్షాల సేనలకు స్వల్ప గాయాలయ్యాయని భారత సైన్యం వెల్లడించింది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటన చేశారు.
ఇక తవాంగ్ ఘర్షణలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సరిహద్దులో యుద్ధానికి చైనా సిద్ధమైనా కేంద్ర ప్రభుత్వం నిద్రలో జోగుతోందని, సరిహద్దు ప్రతిష్టంభనపై సరైన సమాచారం ఇవ్వకుండా మరుగునపరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు చైనాతో సరిహద్దు వివాదం విషయంలో మోదీ సర్కార్ తీరును విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.