జగదల్పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కులో అత్యంత అరుదైన మూషిక జింక (Indian mouse deer) ప్రత్యక్షమైంది. నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు ఈ అరుదైన జీవి ఫొటోలు చిక్కాయి. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 12 జింక జాతులను కనుగొన్నారని, వాటన్నింటిలో మూషిక జింకనే చాలా చిన్నదని పార్క్ డైరెక్టర్ ధమ్షిల్ గన్వీర్ చెప్పారు. దీన్నే స్పాటెడ్ చెవ్రొటెయిన్ అని కూడా అంటారు.
ఈ అరుదైన ఇండియన్ మౌస్ డీర్లు సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్ట్‌లలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఇతర జంతువులను చూస్తే సిగ్గుతో పారిపోయే ఈ నిశాచర జింకల గురించి ఇంకా సమగ్ర అధ్యయనం జరుగలేదని గన్వీర్ తెలిపారు. అడవుల్లో కార్చిచ్చులు, అడవుల ఆక్రమణలు, జంతువుల వేట మొదలైన కారణాలవల్ల ఈ మూషిక జింకల జాతి అంతరించిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ అరుదైన మూషిక జింకల జాతిని కాపాడుకోవడానికి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.