లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారం బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 17న తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసి, ఓ పాఠశాల వద్ద పడేశారు. ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి, చెప్పారు. ఆమె హెల్ప్‌లైన్ ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సామూహిక అత్యాచారం నేరం జరిగినట్లు కేసు నమోదు చేయడానికి తిరస్కరించారు. కేవలం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు మాత్రమే కేసు నమోదు చేశారు.
తమిళనాడు ఘటనలో నిందితుడి ఆత్మహత్య!
చెన్నై: తమిళనాడులో నకిలీ ఎన్సీసీ శిబిరంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు! నిందితుడు శివరామన్‌ను పోలీసులు ఆగస్టు 19న అరెస్టు చేశారు. అంతకు ముందే అతడు పురుగుల మందు తాగాడని, దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు.
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి
జైపూర్: రాజస్థాన్‌లోని గంగా నగర్లో నాలుగేళ్ల బాలికపై ఆమె బంధువు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె తల్లి గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు ఈ దారుణం జరిగింది. ఆమె తల్లి తిరిగి రాత్రి 9 గంటల సమయంలో వచ్చి చూసేసరికి ఆ బాలిక గాయపడి, ఏడుస్తుండటాన్ని గమనించారు. బాధితురాలిని సూరత్‌గఢ్‌లోని దవాఖానలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
లైంగిక దాడి తర్వాత పెండ్లి.. అయినా 20 ఏండ్ల జైలు
కోటా: రాజస్థాన్‌లో 17 ఏండ్ల మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. లైంగి దాడి తర్వాత బాధితురాలిని నిందితుడు పెండ్లి చేసుకొన్నా కోర్టు శిక్షను ఖరారు చేయడం గమనార్హం. బుండి సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిషన్పుర గ్రామంలో కౌశల్ రాజ్ అనే వ్యక్తి 2019లో ఒక మైనర్ బాలికను అపహరించాడు. పోక్సో చట్టం కింద కోర్టు, ముద్దాయికి 20 ఏండ్ల జైలు, రూ.1.30 లక్షల జరిమానా విధించింది.