Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba) మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. 21 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించడంతో ఆయన మంగళవారం ఉదయం 6:30 గంటలకు జైలు నుంచి విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ 21 రోజులూ గుర్మీత్ రామ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బర్నావాలో ఉన్న డేరా ఆశ్రమంలో బస చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా డేరాబాబా విడుదలను వ్యతిరేకిస్తూ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ పరిణామం జరిగిన రోజుల వ్యవధిలోనే ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించడం గమనార్హం.
హైకోర్టును ఆశ్రయించిన గుర్మిత్ రామ్ రహీం సింగ్
మరోవైపు డేరా బాబా ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు సంవత్సర కాలంలో 41 రోజుల ఫెరోల్ ఉందని.. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తలుపుతట్టాడు. 20 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లఫ్లో బయటకు వచ్చేందుకు అర్హత ఉందని పేర్కొన్నాడు. అయితే, కోర్టు అనుమతి లేకుండా భవిష్యత్‌లో డేరా చీఫ్‌కు పెరోల్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవద్దని ఫిబ్రవరి 29న హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫిబ్రవరి 29 నాటి ఉత్తర్వులపై స్టే ఎత్తివేయాలని కోరుతూ డేరా చీఫ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు మంజూరైన పెరోల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దోషులతో సమానంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తన హక్కులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. ఎలాంటి పక్షపాతం, రాగధ్వేషాలు లేని సమర్థ అధికారి ఈ అభ్యర్థనను పరిశీలించాలని ఆగస్టు 9న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పరిశీలన అనంతరం అతడికి పెరోల్ దక్కింది.
ఇదీ కేసు..
2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హరియాణాలోని రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే.
పెరోల్‌పై పలుమార్లు విడుదల..
గత రెండేళ్లలో ఆయనకు ఏడుసార్లు పెరోల్ లభించగా.. నాలుగేళ్లలో మొత్తంగా తొమ్మిదిసార్లు పెరోల్‌పై బయటకు వచ్చాడు. గతేడాది జనవరిలో 40 రోజులు, జులైలో 30 రోజులు, నవంబర్‌లో కూడా 21 రోజులపాటు పెరోల్‌పై బయటకు వచ్చాడు. మొత్తంగా గతేడాది 91 రోజులపాటు ఆయన పెరోల్‌పై బయటే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో కూడా ఆయన దాదాపు 50 రోజుల పాటు పెరోల్‌పై బయటే ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ తాజాగా ఇప్పుడు కూడా 21 పెరోల్ లభించింది. ఇక 2022లో మూడుసార్లు పెరోల్ లభించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో 21 రోజులు, జూన్‌లో (నెలరోజులు), అక్టోబర్‌లో 40 రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక 2020, 2021లో కూడా పలుమార్లు అతడికి పెరోల్ లభించింది.
Also Read..
Kalki 2898 AD OTT | ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Jogi Ramesh | అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్
Rangareddy | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రంగారెడ్డి జేసీ భూపాల్‌రెడ్డి