New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడి ఎంతమాత్రం అంగీకరించదగినది కాదని వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడిని ఖండిస్తున్నామని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వాణిజ్య నౌకలపై దాడి చేస్తూ, సాధారణ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టడాన్ని భారత్ ఖండిస్తోందన్నారు. వాణిజ్య స్వేచ్ఛకు, నావిగేషన్‌కు ఆటంకం కలిగించే చర్యలను నివారించాలని సూచించారు. ఈ ఘటనలో నౌకలోని భారత సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. భారత నౌకపై దాడి తర్వాత వెంటనే స్పందించి, భద్రత కల్పించిన ఒమన్ అధికారులకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరూ అనే విషయాన్ని భారత్ మాత్రం వెల్లడించలేదు.
Our statement on the attack on an Indian-flagged ship off the coast of Oman ⬇️
🔗 https://t.co/whly2BJ4TJ pic.twitter.com/PF0wAQ14zY
— Randhir Jaiswal (@MEAIndia) May 14, 2026
అంతకుముందు ఇదే అంశంపై యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) సంస్థ స్పందించింది. సముద్ర తీరంలో ఒక దాడి జరిగినట్లు వెల్లడించింది. ఒక నౌకను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. గల్ఫ్, ఒమన్ తీరంలో ఇటీవల తరచూ దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు నౌకలపై దాడి చేస్తుండటంతోపాటు, చమురు క్షేత్రాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.