లక్నో: అయోధ్య రామాలయ(Ayodhya Ram Temple) విరాళాలను చోరీ చేసిన కేసులో పలువుర్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణలో కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ కేసులో అరెస్టు అయిన అనుకల్ప్ మిశ్రా అనే వ్యక్తి ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఇటీవల అయోధ్యలో 65 లక్షల ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఇంకా తన స్వంత ఊరిలో ఓ ఫార్మౌజ్ నిర్మించుకున్నాడు. దాదాపు లక్షకు పైగా ఖరీదు చేసే ఓ మోటర్ బైక్ అతనికి ఉన్నది. తాజాగా మహేంద్ర స్కార్పియోను కూడా అతను బుక్ చేసినట్లు తెలిసింది.
అయితే 22 ఏళ్ల అనుకల్ప్ మిశ్రా నెల జీతం కేవలం 15 వేల మాత్రమే. మూడేళ్ల క్రితమే అయోధ్య గుడిలో ఉద్యోగం ప్రారంభించిన అనుకల్ప్ ఇంత తక్కువ సమయంలో అంత విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులను ఎలా సమీకించాడన్న కోణంలో యూపీ పోలీసులు విచారిస్తున్నారు. సక్రమ మార్గంలో తన ఆదాయాన్ని పెంచుకున్నాడా లేక అయోధ్య ఆలయ విరాళాలను చోరీ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అతని వద్ద ఓ వాహనం ఉన్నా.. మళ్లీ మహేంద్ర స్కార్పియో ఖరీదు చేసేందుకు ప్రాసెసింగ్ ఎందుకు చేశాడన్న కోణంలో విచారిస్తున్నారు. ఆ ఆస్తులకు చెందిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కౌశల్పురిలో ఉన్న అనుకల్ప్ నివాసంలో సోదాలు చేపట్టారు. బ్యాంకు రికార్డులు, ప్రాపర్టీ పేపర్లు, ఇతర ఆర్థిక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇటీవల తన స్వంత ఊరిలో ఓ ధార్మిక కార్యక్రమాన్ని అతను ఏడు రోజుల పాటు అత్యంత విలాసవంతంగా నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత కొన్ని ఏళ్లుగా నిందిత వ్యక్తి కుటుంబ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడినట్లు స్థానికులు చెప్పారు. అనుకల్ప్ మిశ్రాతో పాటు ఈ కేసులో అరెస్టు అయిన ఇతర నిందితుల ఆస్తులను కూడా స్క్రూటినీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.