న్యూఢిల్లీ, అక్టోబర్ 29: లైంగికదాడి కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, పెరోల్‌పై విడుదల చేయడాన్ని అడ్డుకోవాలంటే కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు.
బిల్కిస్ బానో కేసు దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, లైంగికదాడి కేసులో దోషి అయిన గుర్మిత్ రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు చేయడాన్ని ఆమె గుర్తు చేశారు. వారిని తిరిగి జైలుకు పంపాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉపయోగించుకొని దోషులు చాలా సులభంగా జైలు నుంచి బయటకు వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి దోషులు జైలు నుంచి బయటికి రాకుండా ఉండాలంటే కఠిన చట్టాలు అవసరమని వెల్లడించారు.