Letter to Rahul | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాల్టి నుంచి ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమి ప్రధాన పూజారి.. రాహుల్ గాంధీకి లేఖ రాశారు. నిజానికి రాహుల్ జోడో యాత్రలో ఆయన పాల్గొనాలని అనుకోగా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో తప్పుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. లేఖలో రాహుల్‌గాంధీని ఆయన ప్రశంసించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయోధ్యలోని రామ జన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్.. రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ప్రజల సుఖం కోసం, సంతోషం కోసం మంచి లక్ష్యం దిశగా పనిచేస్తున్నారని, మీకు అన్నివేళలా ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని, సర్వజన్ హితాయ్.. సర్వజన్ సుఖే అనే ఉదాత్తమైన లక్ష్యం కోసం పనిచేయడం ముదావహమని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న చర్యకు తన మద్దతు ఉంటుందని లేఖలో తెలిపారు. మీ పోరాటం విజయవంతం కావాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నానని, మీ సుదీర్ఘ జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదిస్తున్నానని పేర్కొన్నారు.
ఇలాఉండగా, రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సత్యేంద్ర దాస్ ఆసక్తి చూపారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ చెప్పారు. అయితే, ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల యాత్రలో చేరలేకపోతున్నారని ఆయన తెలిపారు. అందుకే లేఖ ద్వారా తన మద్దతును వ్యక్తపరిచారని ఆయన వెల్లడించారు. ఇలాఉండగా, 9 రోజుల విరామం అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం ఢిల్లీలో తిరిగి ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్ముకశ్మీర్‌కు వెళ్లడానికి ముందు ఈ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో కొనసాగనున్నది.