చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. పూణె లోని పోర్షే కేసు మరవకముందే మరో ఘటన చోటుచేసుకున్నది. రాజ్యసభ ఎంపీకి చెందిన కూతురు(Rajya Sabha MPs Daughter) తన బీఎండబ్ల్యూ కారును ఫూట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి మీద నుంచి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ కేసులో ఆ మహిళకు బెయిల్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీడ మస్తాన్ రావు కూతురు మాధురి కారును ఫూట్పాత్ మీద నుంచి తీసుకెళ్లింది. ఆమెతో పాటు కారులో మరో మహిళా స్నేహితురాలు ఉన్నట్లు తెలిసింది. ఫూట్పాత్పై నిద్రించిన 24 ఏళ్ల సూర్య అనే పెయింటర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తాగిన మైఖంలో ఆ వ్యక్తి బీసెంట్ నగర్ రోడ్డుపై పడుకున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి మాధురి త్వరగా వెళ్లిపోయింది. కానీ కారులో ఉన్న మరో మహిళ అక్కడ ఉన్నవారితో వాగ్వాదానికి దిగింది. సూర్యను ఆస్పత్రికి తీసుకెళ్లినా.. గాయాల వల్ల అతను చనిపోయాడు. 8 నెలల క్రితమే అతనికి పెళ్లి అయ్యింది. జే-5 శాస్త్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.