Kapil Sibal | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు 2034 ఎన్నికలలో మాత్రమే అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. దిల్సే పేరిట నిర్వహించిన ఇంటర్వ్యూ మొదటి ఎపిసోడ్‌ను ఆదివారం ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ బిల్లును హడావిడిగా ఆమోదించుకోవడంలో బీజేపీ నిజాయితీపై సందేహాలు వస్తున్నాయని సిబల్ అన్నారు. 2014లోనే దీనిని ఆమోదించి ఉంటే వారి నిజాయితీని అందరూ తప్పక నమ్మి ఉండేవారన్నారు. అప్పుడు మీరు బిల్లు ఎందుకు ఆమోదించలేదంటూ విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2029 ఎన్నికల నాటికి కూడా అమలు కాదని ఆయన స్పష్టం చేశారు. దానికి గల కారణాలను కూడా వివరించారు. జనాభా లెక్కల సేకరణ అన్నది అతి పెద్ద ప్రక్రియ అని, 140 కోట్ల మంది జనాభాకు సంబంధించిన వివరాలు సేకరించాలంటే ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుందన్నారు. ఇక కులాలు, రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే దేశంలో కొన్నిచోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయని, వాటిని తిరస్కరిస్తే ఆయా రాష్ర్టాలలో బీజేపీకి చావుదెబ్బ తగులుతుందని ఆయన చెప్పారు. కాబట్టి ఈ విషయంలో బీజేపీ నాన్చుడు ధోరణినే పాటిస్తుందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ కూడా దీర్ఘకాలం తీసుకుంటుందన్నారు.
బీఎస్పీ ఎంపీపై ఘోరమైన విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిని తక్షణం పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. తన 30 ఏండ్ల పార్లమెంటేరియన్ జీవితంలో అలాంటి అసభ్యకరమైన భాషను ఎప్పుడూ వినలేదని ఆయన మండిపడ్డారు.