న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీస్‌ను సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గురువారం కొట్టివేశారు. దేశ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను తగ్గించేలా, ఉప రాష్ట్రపతిని కించపరిచేలా తీర్మానం దురుద్దేశంతో ఉందని హరివంశ్ అభిప్రాయపడ్డారు. ధన్‌ఖడ్‌ను విపక్షం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని, ప్రచారం కోసం అభిశంసనను కోరిందని ఆయన తన రూలింగ్‌లో పేర్కొన్నారు.
తనపై వచ్చిన అభిశంసన తీర్మానం నోటీస్ పరిశీలన నుంచి ధన్‌ఖడ్ వైదొలగడంతో డిప్యూటీ చైర్మన్ దాన్ని పరిశీలించి తిరస్కరించారు. ఉప రాష్ట్రపతి తొలగింపునకు సంబంధించిన 67(బీ) అధికరణ కింద ఇచ్చే ఏ నోటీస్నైనా కనీసం 14 రోజుల ముందు ఇవ్వాలని స్పష్టం చేశారు. విపక్షం ఇచ్చిన నోటీస్‌కు సదుద్దేశం లేదన్నారు.