న్యూఢిల్లీ, జూలై 29: రావుస్ ఘటనపై పార్లమెంట్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ముగ్గురు విద్యార్థుల మృతి ఘటనపై దర్యాప్తు జరపాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని లోక్‌సభలో విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. విద్యార్థుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో యూపీలో వాటిని కూల్చివేస్తున్న బుల్డోజర్లను.. ఇక్కడ(ఢిల్లీలో) కూడా అక్రమ నిర్మాణాలపైకి పోనిస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముగ్గురు అభ్యర్థుల మృతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. కోచింగ్ సెంటర్ల క్రమబద్ధీకరణపై ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని పేర్కొన్నారు. అటు బాధిత కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
విద్యార్థుల మృతిపై రాజ్యసభలోనూ స్వల్పకాలిక చర్చ జరిగింది. కోచింగ్ సెంటర్లలో ఫీజులు, సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను నియంత్రించేందుకు చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.కోచింగ్ సెంటర్లపై నియంత్రణ కేంద్రానికి ఉంటుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. మురుగునీరు డ్రైనేజీలను శుభ్రం చేయాలని ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అంతకుముందు రూల్ 267 కింద అభ్యర్థుల మృతిపై చర్చ చేపట్టేందుకు అధికార, విపక్షం మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పూర్తిస్థాయి చర్చకు అనుమతిపై నిర్ణయాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వాయిదా వేశారు. కోచింగ్ వ్యాపారం అయిపోయిందంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.