Rajnath Singh : భారత రక్షణరంగంలో పరిశోధనను, అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న వ్యవస్థను వృద్ధిచేస్తామని రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చెప్పారు. ‘డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ (DAD)’ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని, ఇది మనకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.
కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏళ్లుగా జరిగిన పరిశోధన, అభివృద్ధి ఆధారంగా రూపొందించినవని రాజ్నాథ్ చెప్పారు. ఆ సాంకేతికతలను మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుందని అన్నారు. బడ్జెట్ పెరుగుదలతో దాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు.
రక్షణరంగంలో సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి చెప్పారు. మన సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు.