Rajnath Singh : భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలు, సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల గురించి వారు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
మరోవైపు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌధరి కూడా నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు. సరిహద్దులో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ ఈ వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలావుంటే పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. వీటిని జీర్ణించుకోలేని పాకిస్థాన్ నేతలు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఇదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ సైన్యం.. నియంత్రణ రేఖ (LoC) వెంట దాడులకు పాల్పడుతోంది. వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఇలా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీకి, సైన్యానికి ఇచ్చిన సెలవులను రద్దు చేశారు. వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీచేశారు. జమ్ముకశ్మీర్‌లో సైన్యాన్ని భారీగా మోహరించారు.