న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: స్వేచ్ఛ లభించడం అంటే కేవలం జైలు గోడల నుంచి బయటకు అడుగుపెట్టడం మాత్రమే కాదు. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా 31 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన ఏజీ పేరరివాలన్కు తమిళనాడులోని న్యాయస్థానాలలో కొత్త జీవితం మొదలవుతున్నది. అయితే అది కోర్టు బోనులో కాదు.. బోనుకు ఆవల. 2022లో శిక్షాకాలం తగ్గి విడుదలైన పేరరివాలన్ బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో న్యాయ శాస్త్రం చదివి 2025లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై న్యాయవాదిగా మారారు. ఏ న్యాయ వ్యవస్థ తీర్పు మేరకు 31 సంవత్సరాలు నిందితుడిగా, దోషిగా జైలు జీవితాన్ని గడిపారో ఇప్పుడు అదే న్యాయవ్యవస్థ పరిధిలో న్యాయవాదిగా పనిచేయనున్నారు.
54 ఏండ్ల పేరిరవాలన్ మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేయనున్నారు. సోమవారం న్యాయవాదిగా నల్ల గౌను ధరించి ఆయన తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఖైదీలకు న్యాయ సహాయం అందించడంపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా విలేకరులకు పేరరివాలన్ చెప్పారు. పేరరివాలన్ నమోదు కార్యక్రమానికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి హాజరయ్యారు. 1991లో ఎల్టీటీఈ నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించగా ఈ కేసులో అప్పుడు 19 ఏండ్ల వయసున్న పేరరివాలన్ అరెస్టయ్యారు.