చండీగఢ్: భారతీయ యువకుడికి పాకిస్థాన్ మహిళతో పెళ్లి నిశ్చియమైంది. ఈ నెలాఖరులో జరుగాల్సిన పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి అట్టారి క్రాసింగ్ వద్దకు అతడు వెళ్లాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ వరుడ్ని తిప్పిపంపారు. దీంతో తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియక అతడు ఆందోళన చెందాడు. (Barmer bridegroom sent back) భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల మధ్య పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల శైంతన్ సింగ్‌కు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ అమర్‌కోట్ జిల్లాకు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది.
కాగా, నాటి నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు శైంతన్ సింగ్ కుటుంబం చాలా శ్రమించింది. వీసాలు పొందేందుకు మూడేళ్లుగా ప్రయత్నించింది. అన్ని అడ్డంకులు తొలగడంతో ఫిబ్రవరి 18న ఆ కుటుంబం వీసాలు పొందింది. దీంతో ఏప్రిల్ 30న పాకిస్థాన్‌లో జరిగే పెళ్లికి వారంతా సిద్ధమయ్యారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్నది. పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలు నిలిపివేసింది. గతంలో జారీ చేసిన వీసాలన్నింటినీ రద్దు చేసింది. భారత్‌లోని పాకిస్థాన్ పౌరులు ఏప్రిల్ 27 లోపు తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో పంజాబ్‌లోని వాఘా-అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్థాన్ పౌరులు తిరిగి వెళ్తున్నారు.
కాగా, వరుడు శైంతన్ సింగ్ తన పెళ్లి బృందంతో కలిసి పాక్ వెళ్లేందుకు వాఘా-అట్టారీ సరిహద్దు వద్దకు చేరుకున్నాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని వెనక్కి పంపారు. పెళ్లి బృందం వీసా గడువు మే 12తో ముగియనున్నది. దీంతో నాలుగేళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వరుడు శైంతన్ సింగ్, అతడి కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. పాక్ మహిళతో తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియక అతడు ఆందోళన చెందాడు.