Woman Constable : సమాజంలో బాధితులకు అండగా నిలవాల్సిన ఒక మహిళా కానిస్టేబుల్ (Woman constable) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. సమస్యను చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్ (Police station) కు వచ్చిన ఒక వృద్ధుడిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ (Rajasthan) లోని దుంగార్పూర్ (Dungarpur) జిల్లాలో ఒక వృద్ధుడు తన సమస్యను చెప్పుకోవడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అతడిని కూర్చోమని చెప్పిన కానిస్టేబుల్.. అతడు చెప్పే సమస్య వినడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వృద్దుడిని వెయిట్ చేయమని చెప్పి తాను మాత్రం తన ముందున్న టేబుల్‌పై కాళ్లుపెట్టి, ఫోన్లో చూసుకుంటూ దర్జాగా కూర్చుంది.
లేడీ కానిస్టేబుల్ టేబుల్‌పై రెండు కాళ్లు బారచాపి దర్జాగా కూర్చుని, మొబైల్ ఫోన్లో లీనమైన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ దారుణ ఉదంతం దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చివార పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. రీనా గార్గ్ అనే మహిళా కానిస్టేబుల్ ఆ వృద్ధుడి బాధను వినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు, కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో సదరు వృద్ధుడు దీనంగా ఆమెవైపు చూస్తూ గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరో ఈ నిర్వాకాన్ని తమ మొబైల్లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు.
ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన కాసేపటికే నెటిజన్లు సదరు లేడీ కానిస్టేబుల్ తీరుపై విరుచుకుపడ్డారు. ఒక సీనియర్ సిటిజన్పట్ల ఇంత అమానవీయంగా, అగౌరవంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు వ్యవస్థలో ఉండాల్సిన కనీస వృత్తిపరమైన నిబద్ధత ఇదేనా అంటూ రాజస్థాన్ పోలీస్ విభాగాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో దుంగార్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ కుమార్ రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం, సదరు మహిళా కానిస్టేబుల్ రీనా గార్గ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.