జైపూర్: సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజీకి కారణమైన భూపేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని బెంగూళూరులో అరెస్టు చేసి ఉదయ్‌పూర్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గురువారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భూపేంద్రపై ఉదయ్‌పూర్‌లోని రెండు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
జోధ్‌పూర్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లోని పోలీసులు భూపేంద్ర ఆనవాళ్లను గుర్తించారు. ఆరు రోజుల పాటు బెంగుళూరులో క్యాంపు వేసిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భూపేంద్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి లక్ష రివార్డు ఇస్తామని గతంలో పోలీసులు ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో జైపూర్‌లో ఉన్న భూపేంద్ర గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గత ఏడాది డిసెంబర్లో టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగాయి. అయితే పేపర్ లీకేజ్ వల్ల జనరల్ నాలెడ్జ్ పరీక్షను వాయిదా వేశారు. ఉదయ్‌పూర్‌లో సుమారు 46 మంది విద్యార్థుల్ని కూడా అరెస్టు చేశారు.