జైపూర్: ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌ను మంత్రి దూషించారు. వారిపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. అలాగే ఆ పోలీస్ సిబ్బందిని బదిలీ చేయిస్తానని బహిరంగంగా బెదిరించారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (FIR On Minister) రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 25న మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో సహకార శాఖ మంత్రి గౌతమ్ దక్, డుంగ్లా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ అధికారికి ఫోన్ చేసి స్టేషన్ బయటకు రమ్మని చెప్పారు.
కాగా, పోలీస్ అధికారి బయటకు రాగా, కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ, విష్ణు కుమార్‌ను పిలవమని మంత్రి గౌతమ్ అన్నారు. ఆ ఇద్దరు పోలీసులు బయటకు రాగానే వారిని దూషించారు. ఒక కేసు విషయంపై తన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు రప్పించినందుకు మండిపడ్డారు. అక్కడున్న జనం సమక్షంలో పోలీస్ కానిస్టేబుల్స్‌ను తిట్టారు. అంతేగాక మంత్రి చేయి ఎత్తి వారిపై దాడికి కూడా ప్రయత్నించారు. బదిలీ చేయిస్తానని కానిస్టేబుల్స్‌ను బెదిరించారు.
మరోవైపు మంత్రి గౌతమ్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌ను దూషించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో మే 28న పలు సెక్షన్ల కింద మంత్రి గౌతమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం సీఐడీ సీబీకి అప్పగించారు.
అయితే ఈ ఆరోపణలను మంత్రి గౌతమ్ ఖండించారు. వైరల్ అవుతున్న ఆడియో కల్పితమని అన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఆ ఆడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.