Crime news | తమ్ముడి ప్రేమ వివాహం (Love marriage) అన్న చావుకు వచ్చింది. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్లపోగా.. అమ్మాయి కుటుంబసభ్యులు అన్నపై దాడిచేసి ముక్కు కోసేశారు. దాంతో అబ్బాయి బంధువులు అమ్మాయి చిన్నాన్నపై దాడిచేసి కాలు విరగ్గొట్టారు. ఇప్పుడు ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ (Rajasthan) లోని బర్మేర్ (Barmer) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బర్మేర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అమ్మాయి కుటుంబసభ్యులు ఆ పెళ్లి ఇష్టంలేదు. దాంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణ్ సింగ్ తన భార్యతో గుజరాత్‌కు వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు.
ఈ క్రమంలో శ్రావణ్ సింగ్ అన్న UK సింగ్ గత బుధవారం పొలం నుంచి ఇంటికి వస్తుండగా అమ్మాయి చిన్నాన్న ధర్మ్ సింగ్ కుటుంబసభ్యులతో కలిసి అతడిపై దాడిచేశాడు. ధర్మ్ సింగ్‌ను అణిచిపట్టి పదునైన కత్తితో ముక్కు కోసి పంపించారు. ముఖం నిండా రక్తంతో ఇంటికి వెళ్లిన ధర్మ్ సింగ్‌ను చూసి అతడి బంధువులు ఆగ్రహించారు. అమ్మాయి ఇంటిపై దాడిచేసి చిన్నాన్నను తీవ్రంగా కొట్టారు. అతడి కాలు విరగ్గొట్టారు.
ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు మెరుగైన చికిత్సల కోసం ఇతర ఆస్పత్రులకు పంపించారు. ఘటనపై ఇరు కుటుంబాల వాళ్లు పరస్పరం పెట్టుకున్నారు. పోలీసులు కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.