న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్థుడు బాబూరామ్ భిల్ మరణించినట్లు అధికారులు మరణ ధ్రువపత్రాన్ని జారీ చేశారు. తాను సజీవంగా ఉన్నానని, రికార్డుల్లో పొరపాటును సరిదిద్దాలని ఆయన అధికారులను అనేక విధాలుగా కోరారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఈ నెల 19న గ్రామంలోని పాఠశాలకు వెళ్లి, ఇద్దరు టీచర్లను, మరో వ్యక్తిని కత్తితో పొడిచారు. కొందరు టీచర్లు, విద్యార్థులను నిర్బంధించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు వచ్చి, ఆయనను అరెస్ట్ చేశారు. తాను మరణించినట్లు ధ్రువపత్రం జారీ చేశారని, తాను సజీవంగా ఉన్నట్లు నిరూపించడానికే ఈ విధంగా చేశానని భిల్ చెప్పారు.