జైపూర్: ఇద్దరు భార్యలున్న మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. అతడి రెండో భార్య, తల్లి, మేనకోడలిని కూడా దారుణంగా చంపారు. ఒక వాహనంలో మృతదేహాలు ఉంచి నిప్పంటించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మొదటి భార్య, ఆమె ఇద్దరు పిల్లలను అరెస్ట్ చేశారు. (Ex Village Head Murdered) రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీరాంపురా గ్రామం మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి తన ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. 2005లో మొదటి భార్య సునీతతో అతడికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో సునీత ఇష్టానికి వ్యతిరేకంగా అప్పటి జిల్లా పరిషత్ సభ్యురాలైన సూర్యజ్ఞాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె లా చదువుతున్నది.
కాగా, మే 27న రాత్రి వేళ హైవేపై మహీంద్రా స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోయింది. రామ్ సింగ్, అతడి తల్లి పూసీ దేవి, మేనకోడలు మహిమా చౌదరి కాలిన మృతదేహాలను ఆ వాహనంలో పోలీసులు గుర్తించారు. రెండో భార్య సూర్యజ్ఞాన్ గొంతు కోసి, రక్తంతో తడిగిన ఆమె మృతదేహం సమీపంలోని పొలంలో పడి ఉండటాన్ని గమనించారు. తొలుత అగ్నిప్రమాదం వల్ల ఆ వాహనం కాలిపోయినట్లు భావించారు. అయితే సంఘటనా స్థలాన్ని పరీశీలించిన తర్వాత ఆ నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.
మరోవైపు పోలీసులు రామ్ సింగ్ ఇంటికి చేరుకోగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడని మొదటి భార్య సునీత చెప్పింది. అనుమానించిన పోలీసులు ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మొదటి భార్య సునీత, ఆమె కుమార్తె సరిత, మైనర్ కుమారుడు కలిసి రామ్ సింగ్, అతడి రెండో భార్య, తల్లి, మేనకోడలిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే తల్లితో ఇంటి పనులు చేయించడం, తాగి వచ్చి తల్లితో పాటు తమను రామ్ సింగ్ కొడుతుండటంతో తండ్రిని చంపాలని మైనర్ కుమారుడు పలుసార్లు ప్రయత్నించినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఆహారంలో విషం కలపడం, గనుల ప్రాంతంలో కొండపై నుంచి తోసేందుకు ప్రయత్నించాడు. తండ్రి హత్య కోసం ఆన్లైన్లో కత్తిని కూడా కొనుగోలు చేశాడు.
కాగా, మే 27న రామ్ సింగ్, మొదటి భార్య సునీత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తండ్రిని చంపుతానని కుమారుడు బెదిరించాడు. ఆ రాత్రి వేళ నిద్రిస్తున్న రామ్ సింగ్ గొంతు కోసి హత్య చేశాడు. రెండో భార్య సూర్యజ్ఞాన్ మేల్కొనడంతో కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోసి చంపాడు. అరుపులు, కేకలకు సమీపంలో నిద్రిస్తున్న పూసీ దేవి, మహిమ అక్కడకు రావడంతో తల్లి, సోదరితో కలిసి వారిద్దరిని కూడా హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీస్ అధికారి తెలిపారు. సమీపంలో నిలిపిన ట్రాక్టర్ నుంచి కుమారుడు డీజిల్ తీశాడని, మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్కార్పియో వాహనంలోకి ఎక్కించారని, ఇంటికి సుమారు 500 మీటర్ల దూరం వరకు దానిని నడిపి అక్కడ నిప్పంటించినట్లు చెప్పారు. ఇంటి గోడలు, నేలపై ఉన్న రక్తం మరకలు, సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.