జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్‌పై రెండోసారి లైంగిక దాడి కేసు నమోదైంది. గోగుండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయనపై పది నెలల్లో రేప్ కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెళ్లి పేరుతో వంచించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళలు రెండు కేసుల్లో ఆరోపించారు.
తాజాగా ఓ మహిళ అంబామాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించింది. ప్రతాప్ భీల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి భీల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది.
ఎమ్మెల్యే ప్రతాప్ భీల్‌పై పది నెలల కిందట సుఖేర్లో నమోదైన లైంగిక దాడి కేసుపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉద్యోగం నిమిత్తం ఆయనను కలిసినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో తనకు అనేక సార్లు ఫోన్ చేశాడని, గత ఏడాది మార్చిలో ఆ ఎమ్మెల్యే తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. తనను పెండ్లి చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
కాగా ఈ ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ ఖండించారు.