ముంబై : ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన బొమ్మ(Ravi Varma Painting) భారీ ధర పలికింది. యశోద, కృష్ణుడు ఉన్న ఫోటో సుమారు 167 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ ఆర్ట్‌వర్క్ ఆ ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. వేలంలో కొత్త వరల్డ్ రికార్డు స్థాపించినట్లు చెబుతున్నారు. రవివర్మ గీసిన ఆయిల్ పెయింటింగ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌లో ఆ బొమ్మ అమ్ముడుపోయింది.
1890 దశకంలో రవివర్మ ఆ పెయింటింగ్ వేసినట్లు భావిస్తున్నారు. రవివర్మ ఆ సమయంలో తన కెరీర్లో అగ్రస్థానంలో ఉన్నారు. తల్లి యశోదమ్మతో కన్నయ్య ఉన్న ఆ ఫోటో ఆర్ట్స్ లవర్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. రవివర్మ వేసిన యశోద, కృష్ణుల ఫోటోను సొంతం చేసుకోవడం అద్భుతంగా భావిస్తున్నట్లు డాక్టర్ పూనావాలా తెలిపారు.ఇది జాతీయ సంపద అన్నారు. గతంలో భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్ 118 కోట్లకు వేలంలో అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.