ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తమకు స్నేహితుడని తెలిపారు. అయితే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేలతో బీజేపీ సంబంధం గురించి మీడియాతో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. ‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే హితుడు. ఇప్పుడు రాజ్ ఠాక్రే ఒక స్నేహితుడు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’ అని అన్నారు.
కాగా, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఉద్ధవ్ ఠాక్రేను కలవడం గురించి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. ప్రతీకార రాజకీయాలకు తాను పాల్పడనని తెలిపారు. అందరి నాయకులతో సానుకూలంగా వ్యవహరిస్తానని అన్నారు.
మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఇటీవల ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడంపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆయన చాలా తెలివైన వారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేసిన అబద్ధాలను ఆర్ఎస్ఎస్ ఎలా అధిగమించిందో అన్నది అనుభవజ్ఞుడైన ఆ నేత గ్రహించారని తెలిపారు. శరద్ పవార్, అజిత్ పవార్ తిరిగి కలుస్తారన్న ఊహాగానాలపై మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చని అన్నారు.