న్యూఢిల్లీ : రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు. ఈ ఫిర్యాదుల్లో 33,937 కేసుల్లో వాటిని పరిష్కరించడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నారని నివేదిక వెల్లడించింది.
2018-19 నుంచి 2022-23 మధ్య కాలానికి సంబంధించి ‘సుదూర దూరం ప్రయాణించే రైళ్లలో శుభ్రత, పారిశుధ్యం’ పేరిట వెలువరించిన ఆడిట్ రిపోర్ట్.. ప్రజారోగ్యం, భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైళ్లలో అత్యుత్తమ పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని నొక్కి చెప్పింది.