Railway | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ప్రయాణీకుల రాకపోకలతో స్టేషన్లన్నీ రద్దీగా కనిపిస్తాయి. పండుగలు, సెలవుల సమయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ముందడుగు వేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విజయవంతంగా అమలు చేస్తున్న ‘హోల్డింగ్ ఏరియా’ మోడల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని రైల్వేస్టేషన్లలోనూ అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది. పండుగ సీజన్లో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు, రద్దీని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఢిల్లీ మోడల్‌ను అనుసరించాలని రైల్వేమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇటీవల రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు 76 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్మిస్తున్న హోల్డింగ్ ఏరియాల పురోగతిపై సమీక్షించారు. న్యూఢిల్లీ స్టేషన్‌లోని ఈ విధానంతో సానుకూల ఫలితాలు ఉన్నాయని.. దాంతో జాతీయ స్థాయిలో మోడల్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. వాస్తవానికి దీపావళి, ఛత్ సమయంలో ప్రయాణీకుల రద్దీని నియంత్రించడంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో నిర్మించిన హోల్డింగ్ ఏరియాలు కీలక పాత్ర పోషించాయి. నాలుగు నెలల్లో నిర్మించిన వీటితో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. సీటింగ్ ఏర్పాట్లతో పాటు అత్యాధునిక టికెటింగ్ యంత్రాలు, వైఫై, విశ్రాంతి గదులు సైతం ఉన్నాయి. సెంట్రల్ టికెటింగ్, పోస్ట్-టికెటింగ్, ప్రీ-టికెటింగ్ కేంద్రాలుంటాయి. ఢిల్లీలో ఈ హోల్డింగ్ ఏరియా ప్లాట్‌ఫామ్ వన్ సమీపంలో నిర్మించారు. పండుగ సీజన్లో ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు వెళ్తాయి.
ప్రయాణీకులకు వరుస క్రమంలో వెళ్లి.. ఆపై రైలు ఎక్కేలా చూస్తారు. హోల్డింగ్ ఏరియా మోడల్ పండుగల సమయంలో రద్దీ కారణంగా తొక్కిసలాటలు జరుగకుండా నివారిస్తుందని రైల్వే భావిస్తున్నది. దేశవ్యాప్తంగా నిర్మించబోయే ఈ హోల్డింగ్ ప్రాంతాలు మాడ్యులర్ డిజైన్ ఆధారంగా ఉండాలని రైల్వేలు పేర్కొంటున్నాయి. ప్రతి స్టేషన్లో అందుబాటులో ఉన్న స్థలం, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించనున్నారు. ఇందులో టికెటింగ్ కౌంటర్లు, సీటింగ్, తాగునీరు, ఫుడ్ స్టాల్స్‌తో పాఉట పలు సౌకర్యాలు ఉంటాయి. ఈ హోల్డింగ్ ఏరియాను ‘యాత్రి సువిధ కేంద్రాలు’గా పిలుస్తారు. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న 76 కేంద్రాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు రైల్వేస్టేషన్లలో నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్‌లోనూ స్టేషన్లోనూ హోల్డింగ్ ఏరియాను నిర్మిస్తున్నారు.