న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మేషన్ ఇప్పుడు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందే తెలుస్తోంది. అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తమ టికెట్ కన్ఫర్మేషన్ గురించి రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే లిస్టును తయారు చేసే ప్రక్రియపై రైల్వేశాఖ(Railways) ట్రయల్స్ నిర్వహిస్తున్నది. దీనిపై రైల్వే మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటన చేసింది. పైలెట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.
ఒకవేళ ప్రయాణికుల నుంచి పాజిటివ్ స్పందన వస్తే, అప్పుడు ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 24 గంటల ముందే చార్ట్ ప్రిపరేషన్‌పై పైలెట్ ప్రాజెక్టును బికనీర్ డివిజన్లో చేపడుతున్నారు. ప్రస్తుతం 4 గంటల ముందు చార్ట్ ప్రిపరేషన్ జరుగుతున్నా.. ఆ సమయానికి 24 గంటలకు పెంచనున్నట్లు తెలస్తోంది. రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ దీనిపై మాట్లాడారు. వెయిటింగ్ లిస్టు కేటగిరీలో ఉన్న ప్రయాణికులు తమ ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నారని, వాళ్లను దృష్టిలో పెట్టుకుని 24 గంటల ముందే టికెట్ కన్ఫర్మేషన్ చేస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయితే, ఆ ప్యాసింజెర్ టికెట్‌ను రద్దు చేస్తే అప్పుడు అతను ఎక్కువ అమౌంట్ కోల్పోయే ప్రమాదం ఉంది. క్యాన్సలేషన్ పాలసీ ప్రకారం రైలు బయలుదేరడానికి 12 నుంచి 48 గంటల మధ్య కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేస్తే, అప్పుడు టికెట్ అమౌంట్‌పై 25 శాతం మాత్రమే వెనక్కి ఇచ్చేస్తారు.