త్వరలో జేబులో పెట్టుకునే ఉమ్మి సంచీలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రైల్వేశాఖను తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో ఉమ్మివేత ప్రధానమైనది. గుట్కా, పాన్‌మసాలా నమిలే అలవాటు ఉన్నవారు బోగీలు, రైల్వే స్టేషన్లలో విచక్షణారహితంగా ఉమ్మిని వేస్తుంటారు. ఈ మరకలను తొలగించేందుకు రైల్వే శాఖ ఏటా రూ.1200 కోట్లు, వేల లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తున్నది. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ అధికారులు చిన్నపాటి సంచీలను విక్రయించే వెండింగ్ మెషీన్లు, కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 42 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఈజీస్పిట్’తో రైల్వే శాఖ ఏడాదిఒప్పం దం కుదుర్చుకున్నది. ఈ సంచీని వినియోగించినప్పుడు అందులోని బ్యాక్టీరియా బయటకు రాకుండా మ్యాక్రోమాలిక్యూల్ పల్ప్ టెక్నాలజీని వాడారు. సంచిలో అంతకు ముందే కొన్ని విత్తనాలను ఉంచుతారు. ఆ సంచీ భూమిలో కలిసిపోయి మొక్కగా పెరుగుతుంది.
177 వ్యాగన్ల గూడ్స్ రైళ్లు
అత్యంత పొడవైన రెండు సరుకు రవాణా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. 177 వ్యాగన్లు ఉండే త్రిశూల్ రైలును విజయవాడ డివిజన్లోని కొండపల్లి నుంచి ఒడిశాలోని కుర్దా డివిజన్‌కు.. గరుడా రైలును కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి తెలంగాణలోని మణుగూరుకు నడిపారు. ఇవి సాధారణ గూడ్స్కంటే 2రెట్లు పొడవుంటాయి.