Railway Rules Change | మీరు తరుచూ రైలులో ప్రయాణిస్తుంటారా? అయితే, ఈ వార్త మీ కోసమే. భారతీయ రైల్వే టికెట్ నిబంధనలు మార్చింది. మే ఒకటి నుంచి రైల్వే టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు స్లీపర్ లేదంటే ఏసీ కోచ్‌లలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ప్రయాణికుడు వెయిటింగ్ టికెట్ ఉంటే.. జనరల్ కోచ్‌లలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. మే ఒకటి నుంచి కఠిన నిబంధనలు అమలు చేసిన తర్వాత.. ప్రయాణికులకు వెయిటింగ్ టికెట్లతో స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించడంపై నిషేధం అమలులో ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్‌తో కనిపిస్తే.. టీటీఈ అతనికి జరిమానా విధించే అవకాశం ఉన్నది. లేకపోతే జనరల్ కోచ్‌కు పంపేందుకు అవకాశం ఉంటుంది.
కన్ఫర్మ్ టికెట్లతో ప్రయాణించే ప్రయాణికుల సౌలభ్యం కోసం మాత్రమే ఈ రూల్‌ని రూపొందించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ పేర్కొన్నారు. టికెట్లు పొందిన ప్రయాణికులు వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణికుల కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదని తెలిపారు. సాధారణంగా వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్‌లలోకి ప్రవేశించి.. కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికుల బెర్తుల్లో కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నారని.. దాంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని రైల్వేశాఖ పేర్కొంది. స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్ల ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. రైలులో రాకపోకలకు సైతం ఇబ్బంది అవుతుందని చెప్పింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ప్రయాణాన్ని కష్టతరం చేస్తుందని తెలిపింది.
ఎవరైనా ఓ ప్రయాణికుడు స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణిస్తూ టీటీఈకి పట్టుబడితే అతనికి రూ.250 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీ మొత్తం వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి అదనంగా చార్జీ సైతం చెల్లించాల్సి రావొచ్చు. మరో వైపు ఓ ప్రయాణికుడు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణిస్తే.. మరింత ఎక్కువ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. సదరు ప్రయాణికుడికి రూ.440 జరిమానా చెల్లించడంతో పాటు జనరల్ కోచ్‌కు పంపడం లేదంటే.. తర్వాత వచ్చే రైల్వేస్టేషన్లో దింపివేసే హక్కు టీటీఈకి ఉంటుంది. ఫస్ట్‌క్లాస్ ఏసీలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారీగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు గరిష్టంగా రూ.1000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.