Notice to God | అదేదో సినిమాలో పరేష్ రావెల్.. నీ వల్ల తాను నష్టపోయినందున దాన్ని భర్తీ చేయాలి.. అంటూ దేవుడికి నోటీసు పంపిస్తాడు. అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే రైల్వే అధికారులు కూడా ప్రవర్తించారు. ఆంజనేయ స్వామికే నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తుపోతున్న ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
జార్ఖండ్‌లోని బెరక్బందల్ ఖాటిక్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఖాటిక్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు గత 20 ఏండ్లుగా ఇక్కడే నివసిస్తూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. రైల్వేకు చెందిన స్థలంలో అక్రమంగా నివసిస్తున్నందున తక్షణమే గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలని రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. ఇదే వరుసలో ఇక్కడే ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్న ఆంజనేయుడికి కూడా నోటీసు ఇచ్చారు. 10 రోజుల్లో గుడి ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైల్వే ఇచ్చిన నోటీసులో ‘హనుమాన్ జీ’ అని స్పష్టంగా రాసి ఉండటం కనిపిస్తున్నది. ‘మీరు తమ దేవాలయాన్ని రైల్వే భూమిలో నిర్మించుకున్నారు. మీరు అక్రమంగా ఆక్రమించుకున్నందున ఖాళీ చేయాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ విభాగానికి అప్పగించాలని, లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంజనేయస్వామికి హెచ్చరించారు. ఈ గుడిని 1931 లో నిర్మించినట్లుగా స్థానికులు చెప్తున్నారు.