ముంబై: కదులుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు చైన్ లాగడంతో అది ఒక నది వంతెనపై ఆగింది. దీంతో తిరిగి సెట్ చేసేందుకు రైల్వే లోకో పైలట్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలోని టిట్వాలా, ఖడవలి మధ్యలో ఉన్న ఒక నది వంతెనపై ఆ రైలు ఆగింది. చైన్ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేస్తేనే ఆ రైలు కదులుతుంది.
కాగా, ఆ రైలు నదిపై ఉన్న వంతెనపై మధ్యలో ఆగింది. మరోవైపు ఎమర్జెన్సీ చైన్ లాగిన బోగి, రైలు ఇంజిన్‌కు చివరల్లో ఉంది. దీంతో ఆ బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ చాలా రిస్క్ తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన అతి కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. అనంతరం తన ప్రాణాలను పణంగా పెట్టారు. నది వంతెనపై రైలు ఆగి ఉండటంతో ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేశారు.
మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై స్పందించింది. అవసరం లేకుండా అత్యవసర చైన్ లాగితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. చైన్ లాగడంతో నది వంతెనపై ఆగిన గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరిగి సెట్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ తన ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రైలు చైన్‌ని లాగాలని ట్విట్టర్లో సూచించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా అందులో పోస్ట్ చేసింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనవసరంగా రైలు చైన్ లాగిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అలాగే రిస్క్ చేసి రైలును తిరిగి సెట్ చేసిన లోకో పైలట్ సతీష్ కుమార్ ధైర్యాన్ని అభినందించారు. అయితే ఎలాంటి ప్రమాదం వాటిల్ల కుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు.
Pulling the Alarm Chain for no reason can cause trouble to many!
Satish Kumar, Asst. Loco Pilot of CR,took the risk of resetting Alarm Chain of Godan Express,halted over the River Bridge between Titwala & Khadavli Station.
Pull the chain of a train only in case of an emergency. pic.twitter.com/I1Jhm9MESh
— Ministry of Railways (@RailMinIndia) May 6, 2022