Rail Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో గోండా-మాంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్-డిబ్రూగఢ్ (15904) ఎక్స్ప్రెస్ రైలు 14 కోచ్లు పట్టాలు తప్పాయి. ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 14 మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ఛండీగఢ్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న సమయంలో మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికౌరా గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకున్నది. మొదట రెండుకోచ్లు పట్టాలు తప్పాయి.
ఆ తర్వాత మరో 12 కోచ్లు బోల్తాపడ్డాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది వరకు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు చుట్టు పక్కల జిల్లాల్లో ఉన్న ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలను అలెర్ట్ చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.