న్యూఢిల్లీ : ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటించిన నేపధ్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు. చైనా, పాకిస్తాన్‌లు కలిసి రష్యాకు మద్దతు పలికినట్టు పలు వార్తాంశాలను రాహుల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోదీ సర్కార్ వ్యూహాత్మక తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితి నెలకొందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తొలి నుంచీ తప్పుపడుతున్న రాహుల్ చైనా, పాకిస్తాన్‌లు ఒక్కటయ్యేలా కేంద్రం తీరు ఉందని గత నెలలో ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ మాట్లాడుతూ దేశం నలుమూలలా ప్రతికూల పరిస్ధితులు చుట్టుముట్టాయని, మనం ఈ ప్రాంతంలో ఏకాకిగా మారామని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, పాకిస్తాన్‌లు వేర్వేరుగా ఉండేలా భారత్ వ్యూహాత్మక లక్ష్యం ఉండాలని, అయితే మోదీ ప్రభుత్వం ఆ రెండు దేశాలను ఒక్కటి చేస్తోందని దుయ్యబట్టారు. మనం ఎలాంటి పరిస్ధితి ఎదుర్కోవాలనేది తక్కువగా అంచనా వేయవద్దని..మోదీ నిర్వాకంతో భారత్ పెను ముప్పు ఎదుర్కోబోతోందని అన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం సాగుతున్న వేళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గురువారం భేటీ అయ్యారు. రష్యన్ కంపెనీల సహకారంతో భారీ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా గురువారం యుద్ధం ప్రారంభించడమంతో అమెరికా సహా పలు దేశాలు మాస్కో చర్యను తీవ్రంగా ఖండించాయి. పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.