Rahul Gandhi : పేపర్ లీకేజీ, పరీక్షల్లో స్కాంలు వంటి అంశాల్లో కేంద్ర సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు, నిరుద్యోగం వంటి అంశాలపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పలు సంస్థలతో కలిసి భారీ ఎత్తున వరుస నిరసనలు చేపడుతామన్నారు. ప్రస్తుతం కేంద్ర వైఫల్యం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేణుగోపాల్ అన్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో రాహుల్ పర్యటించి ఆందోళన చేస్తారు. ముందుగా జూన్ 17న కోటలో విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం ప్రయాగ్రాజ్ (అలహాబాద్) జూలై 10న, పాట్నాలో జూలై 11న, జూలై 14న ఢిల్లీలో రాహుల్ విద్యార్థులు, యువతతో కలిసి ఆందోళన చేస్తారు.
దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలతో మిలియన్లకొద్దీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి తల్లిదండ్రులు అదనపు ఖర్చులు భరించలేకపోతున్నారని, ఉద్యోగాల నియామకాల్లో, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని వేణుగోపాల్ విమర్శించారు. ఈ నిరసనల్లో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, పీసీసీలు, డీసీసీలు పాల్గొంటారని వేణుగోపాలు తెలిపారు. కేంద్రానికి నిరసన తగిలేలా, అందరినీ ఏకం చేసే లక్ష్యంతో ఈ ఆందోళన కార్యక్రమాలుంటాయన్నారు.