న్యూఢిల్లీ: భారత భూభాగానికి చెందిన 4 వేల చదరపు కిలోమీటర్ల స్థలాన్ని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాల వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిననున్నట్లు తెలిపారు. ఈ అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. జీరో ఆవర్‌లో ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో చైనాకు ఇంచు స్థలాన్ని కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు ఆరోపించారు.
భారత్, చైనా మధ్య జరుగుతున్న 75వ దౌత్య వార్షికోత్సవ సంబరాలను రాహుల్ గాంధీ తప్పుపట్టారు. 4 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగంపై చైనా అడుగు వేసిందని, చైనీస్ అంబాసిడర్‌తో కలిసి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం షాక్‌కు గురిచేసిందని, చైనా ఆక్రమించిన ఆ స్థలంలో ఏం జరుగుతోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మన భూభాగాన్ని మనం వెనక్కి తీసుకోవాలన్నారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల ఆటో, ఫార్మా, వ్యవసాయ పరిశ్రమలపై ప్రభావం పడనున్నట్లు చెప్పారు. చైనా ఆక్రమించిన భూమి గురించి కానీ, అమెరికా విధిస్తున్న సుంకాల గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నదో ప్రభుత్వం వెల్లడించాలని రాహుల్ అడిగారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి హయాంలో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని ప్రశ్నించారు. హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూనే వెన్నుపోటు పొడిచిందెవరని ప్రశ్నించారు. డోక్లామ్ సమయంలో చైనీస్ అధికారులతో సూప్ తాగిందెవరని అడిగారు. చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఫౌండేషన్ ఎవరిదని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఆ డబ్బు వెళ్లిందా లేదా తెలియదన్నారు.
మోదీ సర్కారు .. డోక్లామ్ వివాదానికి గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. ఇండియన్ ఆర్మీ ఎదురుదాడి చేసిందన్నారు. సరిహద్దుకు వెళ్లి ప్రధాని అక్కడి బలగాల్లో మనోధైర్యం నింపారన్నారు. రక్షణ మంత్రి కూడా వెళ్లినట్లు చెప్పారు. ఇంచు స్థలం కూడా ఎవరూ ఆక్రమించలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం చైనాతో కుమ్మక్కై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు.